వైభవంగా కుమార భీమేశ్వరస్వామి శ్రీపుష్పోత్సవం

UPDATED 16th FEBRUARY 2018 FRIDAY 10:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలోని ప్రసిద్ధ పంచారామక్షేత్రం బాలాత్రిపురసుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి వారి శ్రీపుష్పోత్సవం కార్యక్రమం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్వామివారికి శ్రీపుష్పోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారికి అమ్మవారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 9:20 నిముషాలకు స్వామివారిని ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకుని వచ్చారు. శ్రీపుష్పోత్సవం సంధర్భంగా స్వామి,అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో మెరిసిపోయారు. అలాగే స్వామివారికి అమ్మవారి ఉయ్యాల వద్ద రకరకాల స్వీట్లు, పండ్లు ఉంచారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు, ఈవో పులి నారాయణమూర్తి, ట్రస్టుబోర్డు సభ్యులు, దంపతులు, ఆలయ అర్చకులు వారికి తాంబూలాలను అందచేశారు. అన్నవరం దేవస్థానం ఘనాపాటి శ్రీపాద రాజశేఖరశర్మ, ఆలయ వేదపండితులు వేమూరి సోమేశ్వరశర్మ, కంతేటి భోగరాజు, సన్నిధిరాజు చెరుకూరి రాంబాబు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ads