రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

గంగవరం,30 మే 2020 (రెడ్ బీ న్యూస్) : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ (బాబు), రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. గంగవరం మండలం కొత్తాడ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన రైతుల సమావేశంలో అనంత బాబు మాట్లాడారు.రైతు కష్టం తెలిసిన ముఖ్యమంత్రి జగన్ రైతులకు అన్ని విధాలుగా అదుకుంటారన్నారు. రైతు సంక్షేమం దృష్ట్యా ఏజన్సీలో 77 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఈ ఏడాది రైతు భరోసా పథకంలో 25 వేల మంది రైతులకు ఈపథకాన్ని వర్తింప చేసి రైతుల ఖాతాల్లోనే సొమ్ము జమచేసిన ఘనత వైఎస్సార్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఏడు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1312 మంది రైతుల నుంచి లక్ష క్వింటాలు మేర ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలకు ఏడాది కాలంలోనే నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్దిదారులు సద్వినియోగ చేసుకోవాలన్నారు. ప్రభుత్వం గ్రామ సచివాలయ గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఏ లక్ష్యంతో ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత నచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకువెళ్లాలన్నారు. ప్రజలు వ్యసనాలకు దూరంగా ఉండాలని సంపూర్ణ మద్యనిషేధం అమలుకు అందరూ సహకరించాలన్నారు. ముందుగా డీసీసీబీ చైర్మన్ అనంత బాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించి పశునంవర్ధక శాఖ, వ్యవసాయశాఖ, ప్రకృతి వ్యవసాయం,వ్యవసాయ యంత్ర పరికరాలు, ఉద్యానవన శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వారు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. తహశీల్దార్ ఎం.వీర్రాజు, ఎంపీడీవో జాన్ మిల్టన్, వ్యవసాయశాఖ ఏడిఏ ఎన్.దైవకుమార్, పశునంర్థకశాఖ డీడీ రమేష్ నాయక్, ఉద్యానవనశాఖ అధికారి రమేష్, మండల వ్యవసాయాధికారి సరళ, గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అమృత అప్పలరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
ads