అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

UPDATED 7th AUGUST 2018 TUESDAY 6:00 PM

పెద్దాపురం: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, అన్ని వర్గాల వారికి సమాన న్యాయం చేయాలనే తపనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంటరి మహిళలకు కూడ పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండల పరిధిలోని జి. రాగంపేట గ్రామంలో వర్మీకంపోస్టు తయారీ కేంద్రం వద్ద మండలంలోని 23 గ్రామాలకు సంబంధించిన 137 మంది ఒంటరి మహిళలను గుర్తించి వారికి నెల ఒక్కింటికి రూ.1000 చొప్పున పింఛన్లు మంగళవారం ఆయన అందచేశారు. ఈ సందర్భంగా ఎంపిడివో, ప్రత్యేక అధికారి పి. వసంతమాధవి అధ్యక్షత జరిగిన సభలో మంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ గతంలో రూ.200 ఉన్న పింఛన్ ముఖ్యమంత్రి రూ.1000 చేశారని, అలాగే ఒంటరిగా జీవిస్తున్న మహిళలను గుర్తించి వారికి కూడ రు.1000 పింఛన్ అందిస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ వేయించుకోవాలని, తల్లిబిడ్డకు రు.1000 పారితోషికంతో పాటు ఇద్దరికీ కిట్లు అందచేయడం జరుగుతుందని తెలిపారు. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ ద్వారా గర్భిణీ స్త్రీలకు డెలివరీకి సదుపాయం కల్పించడమే కాకుండా వారికి ఉచితంగా వైద్యపరీక్షలు, మందులు అందచేస్తున్నామని, స్త్రీశిశుసంక్షేమ శాఖ ద్వారా ఐదు కేజీల పౌష్టికాహారాన్ని అందచేస్తున్నామని తెలిపారు. పేదవారి వైద్యానికి లక్షల్లో ఖర్చయితే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలను నిర్మించి చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ప్లేస్కూల్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు, సిసి.రోడ్లు, డ్రైన్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. చంద్రన్న పెళ్లికానుక ద్వారా ఎస్టీకి రూ.50 వేలు, ఎస్సీకి రూ.40 వేలు, బిసికి రూ.35 వేలు వివాహం జరిగే 20 రోజులు ముందు సొమ్మును అందచేయడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించి ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను పొందాలని మంత్రి తెలిపారు. అనంతరం గ్రామ ప్రంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు దుస్తులను పంపిణీ చేసి, వర్మీకంపోస్టు కేంద్రంలో ఏర్పాటు చేసిన చెత్తను ఎరువుగా మార్చే యంత్రాలను మంత్రి ప్రారంభించారు. అలాగే ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కిట్లు అందచేశారు. గ్రామంలో మూడు రోడ్లు, మూడు డ్రైనేజీలకు మంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుందరపల్లి శివనాగరాజు, ఎంపిపి గుడాల రమేష్, ఎఎంసి వైస్ చైర్మన్ ఆచంట రాజబాబు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, పసల పద్మారావు, సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మన్యం చంద్రరావు, బొడ్డు వెంకన్న, తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, తుమ్మల వీరాస్వామి నాయుడు, పంచాయతీ కార్యదర్శి రాజు, మాజీ సర్పంచులు, మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 
ads