కార్మిక పోరాటాలను బలపరచండి

UPDATED 17th JUNE 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: కార్మికులు హక్కుల కోసం చేసే పోరాటాలను బలపరచాలని ఎఐటియుసి జిల్లా నాయకులు తాటిపాక మధు, నల్లా రామారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం  మాట్లాడుతూ ఈనెల 20, 21 తేదీలలో పెద్దాపురం పట్టణంలో జరగనున్న ఏఐటీయూసీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని వారు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ అనేక ఉద్యమాలు నిర్వహిస్తుందని, ఈ పోరాటాలను కార్మికలోకం, ప్రజానీకం బలపరచాలని అన్నారు. కార్మికవర్గ పోరాటాలను ప్రజలు జయప్రదం చేయాలని కోరుతూ రోడ్డుమార్గాన జోలి  పట్టి విరాళాలు సేకరించారు. దేశంలోనే ప్రథమ కార్మిక సంఘం ఏఐటీయూసీ అని, 99 సంవత్సరాలుగా కార్మిక సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ అని వారన్నారు. జిల్లాలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై నిరంతరం వారి వెంట ఉండి పోరాటం చేస్తుందని అన్నారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో అనేక కార్మిక సంఘాలను నెలకొల్పిన చరిత్ర ఏఐటీయూసీకి ఉందని, అందుకనే ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సత్యనారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బొమ్మసాని రవి, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి జి. లోవరత్నం, పార్టీ నాయకులు అన్నవరం, అర్జునరావు, బాపిరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా జాన్ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

ads