వేతనాలు పెంపుపై ఆశా కార్యకర్తలు హర్షం

UPDATED 4th JUNE 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: ఆశా కార్యకర్తల వేతనాలు రూ. మూడు వేలు నుంచి రూ.10 వేలకు పెంచినందుకు సీఐటీయూ మండల కమిటీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మండల ఉపాధ్యక్షురాలు కె. వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి టి. నాగమణి సామర్లకోట అర్బన్ హెల్త్ సెంటర్, వేట్లపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులను కలసి వేతనాలు పెరిగినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జనవరి నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ప్రజాసంకల్ప పాదయాత్రలో తమ బాధలు, ఆవేదన విని చలించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను ఇచ్చిన హామీకి కట్టుబడి తమ వేతనాన్ని నెలకు రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్రలో అడుగడుగునా తమ ఇబ్బందులను గుర్తించిన వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే తమ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన ముఖ్యమంత్రి అయిన ఐదో రోజే తమ వేతనాలు రూ.10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసుందరి, సురేంద్రమణి, అధిక సంఖ్యలో ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ads