ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పోటీలు

UPDATED 24th MARCH 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రస్థాయి ఎడ్లు పరుగు పోటీలు సామర్లకోటలో ఆదివారం ఉత్సాహంగా సాగాయి. స్థానిక  ఉండూరు రోడ్డులోని రైల్వేగేటు వద్ద ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డులో శ్రీ కుమారారామ భీమేశ్వర కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సీనియర్, జూనియర్స్ విభాగంలో ఎడ్లు పోటీపడ్డాయి. సీనియర్‌ విభాగంలో అయిదు జతలు, జూనియర్‌ విభాగంలో 23 జతలు ఎడ్లు పోటీ పడ్డాయి. మొదటిగా సీనియర్‌ విభాగానికి 1600 మీటర్ల దూరం వ్యవధికి పోటీ జరగగా విశాఖ జిల్లా లెక్కలవారి పాలెంకు చెందిన లెక్కల వెంకటకోమలికి చెందిన ఎడ్లు నిర్దేశించిన దూరాన్ని ఐదు నిమిషాల 37 సెకన్ల 44 పాయింట్ల టైములో తిరిగి వచ్చి ప్రథమ స్థానంలో నిలిచి ప్రథమ బహుమతిగా రూ.12 వేలు నగదుతో పాటు షీల్డును రైతుకు ధర్మకర్తల మండలి చైర్మన్ జగదీష్ మోహన్ అందచేశారు. పెద్దాపురం మండలం ఆర్బీ కొత్తూరు గ్రామానికి చెందిన చుండ్రు సత్యనారాయణకు చెందిన ఎడ్లు 5 నిమిషాల 46 సెకన్లలో ద్వితీయ స్థానంలో నిలిచి రూ. ఎనిమిది వేలు నగదుతో పాటు షీల్డును ఆయన అందచేశారు. జూనియర్స్ విభాగంలో సామర్లకోట పట్టణానికి చెందిన  వల్లూరి సత్యేంద్రకుమార్‌కు చెందిన ఎడ్లు జత నిర్ణీత దూరం వెయ్యి మీటర్లును 4 నిమిషాల 27 సెకన్ల 78 పాయింట్ల కాలంలో ప్రథమ బహుమతిని సాధించి రూ.12వేలు నగదుతో పాటు మెమెంటోను రైతు అందుకున్నారు. ద్వితీయ బహుమతిని కాపవరం గ్రామానికి చెందిన కుంచం మనోజ్‌కు చెందిన ఎడ్లు, తృతీయ స్థానాన్ని రాజానగరం మండలం వెలుగుబంద గ్రామానికి చెందిన కుట్టి లక్ష్మణ్‌ శివ పవన్‌ కుమార్‌కు చెందిన ఎడ్లు సాధించాయి. ద్వితీయ బహుమతిగా రూ.10వేలు నగదు, మెమెంటో, అలాగే తృతీయ బహుమతిగా రూ.ఎనిమిది వేలు నగదు, మెమెంటోలను రైతులకు అందచేశారు. నాల్గవ బహుమతిగా రూ.ఆరు వేలు నగదు, మెమెంటోను పండూరు శ్రీను, ఐదవ బహుమతిగా రూ. నాలుగు వేలు నగదు, మెమెంటోను పశ్చిమగోదావరి జిల్లా ముప్పర్తిపాడుకు చెందిన కొప్పాక రేవంత్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా సిద్దా నానాజీ, ఉండవల్లి వీరేందర్‌ వ్యవహరించారు.


 

ads