రథ సప్తమి

UPDATED 24th JANUARY 2018 WEDNESDAY 9:00 AM

జీవరాశికి ప్రాణశక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదించే అధిదేవత సూర్యుడు. సూర్యుడు జ్ఞానమండలం అని సూర్య మండలాష్టకమ్‌ చెబుతుంది. ‘జయాయ జయ భద్రాయ’ అంటుంది ఆదిత్య హృదయం. శరీరయాత్రలో జీవుడు చేసే కర్మలన్నింటికీ సాక్షీభూతుడు సూర్యుడు. బాహ్యప్రపంచాన్ని వెలిగించడంతో పాటు, అంతరంగంలో ఆవరించిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపం రవిబింబం. ప్రత్యక్ష దైవంగా సూర్యుణ్ని ఆరాధిస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందని సాధకుల ప్రగాఢ నమ్మకం. అందుకే సూర్యుడు సూర్యనారాయణ స్వామిగా రథసప్తమినాడు పూజలందుకుంటున్నాడు. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రథ సప్తమిగా ప్రసిద్ధం. సూర్యరథం దక్షిణాయనం ముగించి, పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మాఘ సప్తమి మొదలు, వచ్చే ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం. అదితి, కశ్యప ప్రజాపతి దంపతులకు మహావిష్ణువు సూర్య భగవానుడిగా ఉదయించాడు కాబట్టి, నేడు ‘సూర్య జయంతి’ అని పురాణ గాథలు చెబుతాయి. సూర్యరథానికి కూర్చిన ఏడు గుర్రాలు ఏడు వారాలకు, పన్నెండు చక్రాలు పన్నెండు రాశులకు సంకేతాలు. సూర్యుడి పేరుతో ప్రారంభమయ్యేది భానువారం. శనివారంతో వారాంతమవుతుంది. మేషం నుంచి మీనం దాకా పన్నెండు రాశుల్ని పూర్తిచేయడానికి, సూర్యరథానికి ఒక ఏడాది పడుతుందంటారు. ఒకే సూర్యుడు పన్నెండు రూపాలు, పన్నెండు పేర్లతో ప్రకాశించడాన్ని ఆ విరాట్‌ పురుషుడి నేత్రావధాన ప్రభావంగా పరిగణిస్తారు. వేదవాక్యాన్ని అనుసరించి- ఉత్తరాయణం పుణ్యకాలంలా, ఆ సూర్యకాంతిలో జీవితం సాగడం మహాభాగ్యంగా వర్ణిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే భీష్మాచార్యులు అంపశయ్యపైన ఎదురుచూశారు. ఋగ్వేదంలోని  పదో మండలం ఎనభై అయిదో మంత్రమే సూర్యుడి పరంగా చెప్పిన గాయత్రీ మంత్రం! రోజూ ఉదయ సూర్యుడికి ఎదురుగా నిలిచి నమస్కరించే ఆచారం అనాదిగా వస్తోంది. సూర్యోపాసకుల నిత్య జీవితంలో సూర్యనమస్కారాలకు ప్రత్యేక స్థానముంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడికి యోగాభ్యాసం చేసేవారూ పెద్దపీట వేశారు. రథ సప్తమి నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఉగాది నాటికి ప్రకృతికాంత సొగసులు సంతరించుకుంటుంది. పంటల పండుగ సంక్రాంతి తరవాత అవతరించే రథం పండుగ ఇది. రథ సప్తమినాడు ముంగిట్లో రథం ముగ్గులు సుందరంగా కనిపిస్తాయి. ఆ ముగ్గుల నడుమ పిడకలు వేసి, సూర్యభగవానుడికి ప్రియమైన పాయసం వండుతారు. పిడకలపైన పాలు పొంగించడాన్ని ‘సిరుల పొంగు’కు సంకేతంగా భావిస్తారు. అప్పటికే రైతులు ధాన్యరాశులను ఇళ్లకు చేర్చి ఉంటారు. ఉదయాన్నే ఇంటిల్లపాదీ స్నానాలు ముగిస్తారు. గాయత్రీ జపం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రం వంటి స్తోత్ర పాఠాలు వల్లిస్తూ పూజలు చేస్తారు. మహావిష్ణువు ప్రతిరూపంగా పూజించే సూర్యభగవానుడికి చైనా, జపాన్‌, ఈజిప్టు, దేశవిదేశాల్లో ఘనంగా పూజలు నిర్వర్తిస్తారు.
ads