ఇలవైకుంఠము

UPDATED 29th DECEMBER 2017 FRIDAY 9:00 PM

ద్వారకాతిరుమల: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శేషాచలవాసుని ఆలయ వైకుంఠ ద్వార దర్శనంతో భక్తకోటి పునీతమైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజాము నుంచే ద్వారకా తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ముందుగా ఆలయ ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై విశేషంగా అలంకరించారు. తెల్లవారుజామున 4 గంటలకు గరుడ వాహనరూఢుడైన ద్వారకాధీశునికి ఆలయ అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఛైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు, ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు స్వామివారికి హారతులిచ్చారు. ఉదయం 4.30 గంటల సమయంలో మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ ఉత్తర ద్వారాలు తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీనివాసుని దివ్యమంగళ రూపాన్ని కనులారా వీక్షించారు. సాయంత్రం 7గంటల వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శన సౌకర్యం కల్పించారు. తెల్లవారుజాము నుంచి గరుడ వాహనంపై ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చిన స్వామివారు ఉదయం 7.30 గంటల తర్వాత వెండి శేష వాహనంపై దర్శన భాగ్యం కల్పించారు. సుమారు 50వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గోవింద మాలధారులు గిరి ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఇరుముడులు సమర్పించి మాల విరమణ చేశారు. అశేష భక్తజనంతో శేషాచలం కిక్కిరిసింది. క్షేత్రం గోవింద నామస్మరణలతో మార్మోగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు క్యూలలో బారులుతీరారు. స్వామి వారిని దర్శించుకుని తిరిగి వచ్చే భక్తులకు క్యూలలో శ్రీవారి ఉచిత ప్రసాదాన్ని వితరణ చేశారు. క్యూలలో వేచియున్న చిన్నారులు, వృద్ధులకు ఆలయ అధికారులు దాతల సహకారంతో  పాలు, బిస్కెట్లు అందజేశారు. దర్శనం క్యూలైన్లలో భక్తులకు మంచి నీరు అందించారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది దగ్గరుండి దర్శన సౌకర్యం కల్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు పర్యవేక్షించారు. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు శ్రీవారి అన్నదానంలో ఉదయం 9 గంటల నుంచి భోజనసదుపాయం కల్పించారు. వేలాది మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ముక్కోటి ఏకాదశి రోజున గరుడ వాహనంపై ద్వారకాతిరుమలేశుని గ్రామోత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం 7.30 గంటల వరకు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి తనను చూడలేని భక్తులకు దర్శనమిస్తూ క్షేత్రంలో ఊరేగారు. మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల నడుమ వేడుక వైభవంగా జరిగింది. స్వామివారు గ్రామంలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి భక్తకోటి పులకించింది. శ్రీవారిని సేవించి తరించింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయానికి చేసిన విశేష అలంకరణ ఆకట్టుకుంది. రంగురంగుల పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరణ కనువిందు చేసింది. తెల్లవారుజామున శ్రీవారి ఆలయం విద్యుద్దీపకాంతులను వెదజల్లుతూ ప్రకాశించింది.
 
ads