ఏలేరు వరద ఉధృతికి కుప్పకూలిన వంతెన

పెద్దాపురం, 4 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్): ఏలేరు వరద ఉధృతికి మండల పరిధిలోని కాండ్రకోట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున బ్రిటీష్ కాలంనాడు నిర్మించిన వంతెన కుప్పకూలింది. ఇటీవల ఈ వంతెన వరద ఉధృతికి బీటలు వారి మధ్యలో కొద్దిగా కుంగిపోయింది. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వంతెనపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే వరద ఉధృతికి వంతెన కింద భాగంలో నీటి ప్రవాహం అధికం కావడంతో ఒక స్థంభం వద్ద కోతకు గురికావడంతో వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కాండ్రకోట, తూర్పుపాకలు గ్రామాలకు రవాణా సదుపాయం పూర్తిగా నిలిచిపోయింది. అలాగే రైతులు పొలాలకు వెళ్లేందుకు అవస్థలు తప్పేలా లేవు. కాండ్రకోట గ్రామానికి వెళ్లాల్సి వస్తే కిర్లంపూడి మండలం రామ చంద్రపురం గ్రామం మీదుగా కాండ్రకోటకు రావాల్సి వస్తుందని ఇరు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వంతెన కూలిన విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, తహసీల్దార్ బూసి శ్రీదేవి, ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, వైసీపీ మండలాధ్యక్షుడు గవరసాన సూరిబాబు తదితరులు అక్కడకు చేరుకుని కూలిన వంతెనను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వంతెన నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.
ads